CRISIL Report On Indian Thali Price: శాఖాహారం, మాంసాహారం – ఈ రెండిటిలో దేని భోజనం రేటెక్కువ అని అడిగితే, వెజ్‌ కంటే నాన్‌-వెజ్‌ భోజనమే రేటెక్కువ అని ఎవరైనా చెబుతారు. కానీ వాస్తవాల్ని పరిశీలిస్తే, మన దేశంలో మాంసాహారం కంటే శాఖాహార భోజనమే కాస్ట్‌లీగా మారింది, కామన్‌మ్యాన్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

శాఖాహారం, మాంసాహార భోజనం ధరలపై క్రిసిల్‌ రిపోర్ట్‌
భారత్‌లో, గత ఏడాది కాలంలో, శాఖాహార భోజనం (vegetarian thali) ధర 5 శాతం పెరిగింది & మాంసాహార భోజనం (non-vegetarian thali) రేటు 13 శాతం తగ్గింది. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతూ క్రిసిల్ (CRISIL) ఒక రిపోర్ట్‌ విడుదల చేసింది.

RRR లెక్క ప్రకారం ‍(RRR అంటే సినిమా పేరు కాదు, రోటీ రైస్ రేట్)… ఒక ప్లేట్‌ శాఖాహార భోజనంలో రోటీ, ఉల్లిపాయ, టమోటా, బంగాళదుంపలు, బియ్యం, పప్పు, పెరుగు, సలాడ్ ఉంటాయి. మాంసాహార భోజనంలో.. పప్పు స్థానంలో బ్రాయిలర్ చికెన్ ఉంటుంది, మిగిలినవన్నీ వెజ్ థాలీలో ఉన్న ఐటమ్సే ఉంటాయి.

ఈ ఏడాది జనవరిలో, ఒక ప్లేట్‌ శాఖాహార భోజనం తయారు చేయడానికి రూ.28 ఖర్చయితే.. గతేడాది జనవరిలో ఇది రూ.26.60 గా ఉంది. అదే సమయంలో.. ఒక ప్లేట్‌ మాంసాహార భోజనం ధర రూ. 59.90 నుంచి రూ. 52 కు తగ్గిందని క్రిసిల్‌ రిపోర్ట్‌ చేసింది.

అధిక ద్రవ్యోల్బణానికి అద్దం పడుతున్న రేట్లు
శాఖాహార భోజనం రేటు పెరగడానికి ప్రధాన కారణం కూరగాయలు, ధాన్యం రేట్లు పెరగడమేనని క్రిసిల్‌ వెల్లడించింది. ఈ ఏడాది కాలంలో టమోటా ధర 20 శాతం, ఉల్లిపాయల ధర 35 శాతం, బియ్యం రేటు 14 శాతం, పప్పుల రేటు 21 శాతం పెరిగాయని చెప్పింది. ఆహార పదార్థాల రేట్లు ఏ రేంజ్‌లో మండిపోతున్నాయో మనకూ తెలుసు.

2023 జనవరితో పోలిస్తే 2024 జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉందన్న విషయాన్ని వెజ్ థాలీ ధర తేటతెల్లం చేస్తోంది. 2023 జనవరిలో చిల్లర రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) 6.52 శాతంగా, ఆహార ద్రవ్యోల్బణం 5.94 శాతంగా నమోదైంది. 2024 జనవరి డేటా వచ్చే వారంలో విడుదలవుతుంది.

2023 డిసెంబర్‌లో చూస్తే.. రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ 5.69 శాతం కాగా, ఆహార ద్రవ్యోల్బణం 9.53 శాతంగా ఉంది. అంటే, 2023 తొలి నెల, చివరి నెలను పోల్చి చూసినా, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల తీవ్రత మనకు అర్ధం అవుతుంది. 

ఇక నాన్-వెజ్ విషయానికి వస్తే… ఈ ఏడాది కాలంలో బ్రాయిలర్ చికెన్‌ ధర 26 శాతం తగ్గిందట, కోళ్ల జనాభా పెరగడం వల్ల రేటు తగ్గిందని క్రిసిల్‌ వెల్లడించింది. ఒక ప్లేట్‌ నాన్ వెజ్ థాలీ మొత్తం ఖరీదులో 50 శాతం బ్రాయిలర్‌దే. చికెన్‌ రేటు తగ్గడం వల్ల నాన్‌ వెజ్‌ మీల్స్‌ రేటు దిగొచ్చింది.

2023 జనవరితో కాకుండా, డిసెంబర్‌ నెలతో పోల్చి చూస్తే… 2024 జనవరిలో (ఒక నెలలో) అటు శాఖాహారం, ఇటు మాంసాహార భోజనం రెండింటి ధర తగ్గింది. గత నెల రోజుల్లో, వెజ్ థాలీ రేటు 6 శాతం తగ్గితే, నాన్ వెజ్ థాలీ ధర 8 శాతం తగ్గింది అని ఆ నివేదికలో క్రిసిల్‌ రాసింది.

2023 డిసెంబర్‌తో పోలిస్తే 2024 జనవరిలో ఉల్లిపాయల రేటు 26 శాతం, టొమాటో ధర 16 శాతం తగ్గడం వల్ల సామాన్యుడిపై భారం కాస్త తగ్గింది. ఎగుమతి అడ్డంకులు తొలగిపోవడం, ఉత్తర & తూర్పు రాష్ట్రాల నుంచి టొమాటో సప్లై పెరగడం దీనికి కారణంగా క్రిసిల్‌ వెల్లడించింది. బ్రాయిలర్‌ కోడి ధర కూడా నెల రోజుల్లో 8-10 శాతం తగ్గడం వల్ల మాంసాహార భోజనం ధర తగ్గిందని వివరించింది.

మరిన్ని చూడండిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *