LIC Loan Against LIC Policy: ఒక వ్యక్తి లోన్‌ కోసం బ్యాంక్‌కు వెళితే, చాలా రకాల డాక్యుమెంట్స్‌ అడుగుతారు. ముఖ్యంగా, షూరిటీగా ఏం పెడతారు అని ప్రశ్నిస్తారు. షూరిటీ లేకపోతే లోన్‌ ఇవ్వడానికి నిరాకరిస్తారు. షూరిటీ లేకుండా బ్యాంకులు లోన్‌ ఇవ్వాలంటే మీకు స్థిరమైన ఆదాయం (నెలనెలా జీతం లాంటివి) ఉందన్న రుజువులు చూపాలి. బ్యాంకులు, షూరిటీ లేకుండా ఇచ్చే లోన్లపై ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. మీకు ఎల్‌ఐసీ పాలసీ ఉంటే, బ్యాంకుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి, లోన్‌ ఈజీగా వస్తుంది.

మన దేశంలో కోట్లాది మంది ప్రజలకు కనీసం ఒక ఎల్‌ఐసీ పాలసీ అయినా ఉంటుంది. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటారు. ఎల్‌ఐసీ పాలసీతో జీవిత బీమా కవరేజీ, దీర్ఘకాలికంగా మంచి రాబడి ప్రయోజనాలు మాత్రమే కాదు, లోన్‌ ఫెసిలిటీ (Loan Against LIC Policy) కూడా లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు నుంచి అధిక వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణం (personal loan) వంటివి తీసుకునే బదులు, LIC నుంచి లోన్‌ రుణం తీసుకోవడం ఉత్తమం. 

LIC పాలసీపై రుణం ఎలా తీసుకోవాలి ?
మీ LIC పాలసీయే మీ లోన్‌కు షూరిటీ. జీవిత బీమా సంస్థ, మీ పాలసీని తనఖా పెట్టుకుని మీకు లోన్‌ మంజూరు చేస్తుంది. దీనిని సురక్షిత రుణంగా (Secured loan) పరిగణిస్తుంది. కాబట్టి, ఎక్కువ జాప్యం లేకుండా, బ్యాంక్‌ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకే లోన్‌ శాంక్షన్‌ అవుతుంది. 

ఒకవేళ, ఎల్‌ఐసీ లోన్‌ తీసుకున్న వ్యక్తి రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోతే, అతని పాలసీ మెచ్యూరిటీ డబ్బు నుంచి రుణ మొత్తాన్ని ఎల్‌ఐసీ జమ చేసుకుంటుంది. అంటే, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, 

ఒకవేళ మీ దగ్గర ఎల్‌ఐసీ పాలసీ ఉంటే, దానిపై మీకు ఎంత లోన్‌ లభిస్తుందనే సమాచారాన్ని LIC ఈ-సర్వీసెస్‌ (LIC e- Services) ద్వారా తెలుసుకోవచ్చు. లోన్‌ మంజూరు చేయడానికి, సంబంధిత పాలసీ బాండ్‌ను బీమా కంపెనీ తన వద్దే  ఉంచుకుంటుంది. పాలసీ మెచ్యూరిటీ సమయానికి మీరు రుణాన్ని తిరిగి చెల్లించని పక్షంలో, పాలసీ డబ్బు నుంచి లోన్ అసలు + వడ్డీని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని పాలసీదారు ఖాతాకు క్రెడిట్‌ చేస్తుంది. లోన్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా, కొంతమంది ఈ మార్గాన్ని అనుసరిస్తుంటారు.

ఒక పాలసీపై ఎంత లోన్‌ వస్తుంది?
పాలసీ మొత్తం సరెండర్ విలువలో దాదాపు 90 శాతం మొత్తాన్ని రుణంగా పొందొచ్చు. కొన్ని ప్రి-పెయిడ్ పథకాలపై ఈ పరిమితి 85 శాతం వరకు ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే… ఎల్‌ఐసీ పాలసీని తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే, ఆ బీమా పాలసీని ప్రారంభించి కనీసం 3 సంవత్సరాలై ఉండాలి.

ఎల్‌ఐసీ లోన్‌ కోసం ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసే విధానం:
మొదట, ఎల్‌ఐసీ ఈ-సర్వీసెస్‌లో మీ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి.
ఆ తర్వాత, ఈ-సర్వీసెస్‌లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
మీరు సంబంధిత పత్రాలతో పాటు KYC ప్రక్రియ పూర్తి చేయాలి.
ఇప్పుడు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను LIC బ్రాంచ్‌కు పంపాలి.
అన్నీ సక్రమంగా ఉంటే, 3 నుంచి 5 రోజుల్లో మీ లోన్‌కు ఆమోదం లభిస్తుంది.

ఎల్‌ఐసీ రుణం కోసం ఆఫ్‌లైన్‌లో అప్లై చేసే విధానం:
LIC లోన్‌ కోసం ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం, మీ పాలసీని కలిగి ఉన్న LIC బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ, లోన్ అప్లికేషన్‌ ఫారం నింపాలి. మీ పాలసీ బాండ్, ఇతర అవసరమైన పత్రాలను అక్కడి అధికారులకు సమర్పించాలి. ఇలా చేసిన 3 నుంచి 5 రోజుల్లో మీ లోన్‌ అప్లికేషన్‌కు ఆమోదం లభిస్తుంది.

మరో ఆసక్తికర కథనం: భయపెడుతున్న పసిడి – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *