స్టాక్‌ మార్కెట్‌లో బుల్లిష్ తుపాను – 69500 పైన సెన్సెక్స్, 21000కి చేరువలో నిఫ్టీ


Stock Market Today News in Telugu: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుల్లిష్‌ తుపాను కొనసాగుతోంది. మార్కెట్‌ ప్రధాన సూచీలు రోజుకో కొత్త శిఖరాన్ని ఎక్కుతూ వెళుతున్నాయి, గత రికార్డులు చరిత్రలో కలిసిపోతున్నాయి. BSE సెన్సెక్స్ అయినా, NSE నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా… అన్నీ ఆల్-టైమ్ హై రికార్డ్ స్థాయుల్లోనే ఓపెన్‌ అవుతున్నాయి. 

ఈ రోజు (బుధవారం, 06 డిసెంబర్‌ 2023) కూడా దేశీయ షేర్‌ మార్కెట్‌లో బుల్స్‌ ర్యాలీ కనిపించింది, వరుసగా మూడో రోజు మార్కెట్ రికార్డ్‌ గరిష్ట స్థాయిలో ప్రారంభమైంది. దేశీయ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ సంస్థాగత మదుపుదార్లు (FIIs) కూడా స్టాక్ మార్కెట్‌పై నమ్మకం ఉంచారు, ఇండియన్‌ కంపెనీల షేర్లను భారీగా కొంటున్నారు.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
మంగళవారం 60,296 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 238.79 పాయింట్లు లేదా 0.34 శాతం పెరుగుదలతో 69,534 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. ఆ వెంటనే 69,668.71 స్థాయికి చేరింది, ఇది సెన్సెక్స్‌ జీవితకాల గరిష్టం (Sensex fresh all-time high). 

గత సెషన్‌లో 20,885 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 95.65 పాయింట్లు లేదా 0.46 శాతం ఆకట్టుకునే లాభంతో 20,950 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. ఆ వెంటనే మరో ఆరు పాయింట్లు జోడించి 20,956.55కి చేరింది. ఇది నిఫ్టీకి చారిత్రాత్మక గరిష్ట స్థాయి (Nifty fresh all-time high).

బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్‌ బుకింగ్‌
బ్యాంక్ నిఫ్టీలోనూ బుల్లిష్ ట్రెండ్ కొనసాగింది, ఓపెనింగ్‌లో రికార్డు స్థాయిని అందుకుంది. ఆ తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 47,256 వద్ద ప్రారంభమైంది. ప్రారంభమైన 10 నిమిషాల్లోనే గరిష్ట స్థాయి 47,259ని కనిష్ట స్థాయి 46,847ని టచ్‌ చేసింది. ఓపెనింగ్‌ టైమ్‌లో.. బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 5 షేర్లు లాభాల్లో ఉండగా, 7 షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

లాభాలు కంటిన్యూ చేస్తున్న అదానీ షేర్లు
అదానీ గ్రూప్ స్టాక్స్ ప్యాక్‌ మంచి లాభాలతో పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంది. వరుసగా మూడో రోజు కూడా ఈ గ్రూప్‌ షేర్లు వేగంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలో… అదానీ పోర్ట్స్‌ 4.50 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 5 శాతం పెరిగాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో దాదాపు 14 శాతం బంపర్ జంప్ చేసింది. 

ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్‌ 290.38 పాయింట్లు లేదా 0.42% పెరిగి 69,586.52 స్థాయి వద్ద; నిఫ్టీ 75.85 పాయింట్లు లేదా 0.36% గెయిన్స్‌తో 20,930.95 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం (RBI MPC Meeting December 2023)
ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ భేటీ ఫలితాలు డిసెంబర్‌ 8న (శుక్రవారం) విడుదలవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన గత నాలుగు సమావేశాల్లో రెపో రేట్లు పెరగలేదు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుండడంతో ఈసారి కూడా వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని మార్కెట్‌ భావిస్తోంది. ఈ అంచనాలకు విరుద్ధంగా వచ్చే ఫలితాలు మార్కెట్‌ గమనంపై ప్రభావం చూపుతాయి. దీంతో పాటు గ్లోబల్ క్యూస్ కూడా ఇండియన్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి.

ప్రపంచ మార్కెట్లలో విషయానికి వస్తే… నిన్న (మంగళవారం) US మార్కెట్లు మిక్స్‌డ్‌గా క్లోజ్‌ అయినప్పటికీ, ఈ రోజు ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియాలోని కీలక సూచీలు 0.5 శాతం నుంచి 1.5 శాతం వరకు పెరిగాయి.

మంగళవారం, వాల్ స్ట్రీట్‌లో, డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, S&P 500 వరుసగా 0.22 శాతం, 0.06 శాతం పడిపోయాయి. వీటికి విరుద్ధంగా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.31 శాతం లాభపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *