Sweep Account: మన దేశంలో కోట్లాది మందికి బ్యాంక్‌ పొదుపు ఖాతా (savings account) ఉంది. వ్యాపారస్తులు కరెంట్‌ అకౌంట్‌ (current account) ఓపెన్‌ చేస్తారు. సేవింగ్స్‌ ఖాతా, కరెంట్‌ అకౌంట్‌ మీద పెద్దగా వడ్డీ రాదు. అదే డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) చేస్తే మంచి ఆదాయం లభిస్తుంది. పొదుపు/కరెంట్ ఖాతాలపై ఎక్కువ వడ్డీ రాకపోయినా, అందులో ఉన్న డబ్బును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. FD అకౌంట్‌లో ఎక్కువ వడ్డీ వచ్చినా, నిర్దిష్ట సమయం వరకు అందులో డబ్బును వెనక్కు తీసుకోవడం కుదరదు.

పొదుపు/కరెంట్ ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లోని బెనిఫిట్స్‌ను మాత్రమే కలిపే ఒక అద్భుతమైన ఫీచర్‌ను బ్యాంక్‌లు రన్‌ చేస్తున్నాయి, చాలా మందికి ఈ విషయం తెలీదు. అదే స్వీప్‌ ఇన్ (sweep-in) ఫీచర్‌. ఈ ఫెసిలిటీతో అకౌంట్‌లోని డబ్బును ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు, పైగా FD తరహా వడ్డీని కూడా పొందొచ్చు.                

స్వీప్ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది?
స్వీప్ ఇన్ ఫీచర్, మీ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలోని అదనంగా ఉన్న డబ్బును FD లాగా మారుస్తుంది. ఉదాహరణకు… మీ నెలవారీ ఖర్చులు పోను మరికొంత మొత్తం బ్యాంక్‌ అకౌంట్‌లో మిగులుతుందని అనుకుందాం. ఇలా మిగిలే డబ్బును అదే అకౌంట్‌లో ఉంచితే బ్యాంకు మీకు నామమాత్రపు వడ్డీని చెల్లిస్తుంది. దీనిపై మంచి వడ్డీ రాబట్టుకోవడానికి స్వీప్‌ ఇన్‌ ఫీచర్‌ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీ నెల శాలరీ రూ. 50 వేలుగా భావిద్దాం. మీరు స్వీప్ ఇన్ ఫీచర్ కింద మీ సేవింగ్స్‌ లేదా కరెంట్‌ ఖాతాలో 50 వేల రూపాయల పరిమితిని పెట్టారు. ఇప్పుడు మీ అకౌంట్‌ 50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు మిగిలి ఉంటే, అది FD అవుతుంది. ఈ అదనపు డబ్బు మీద అధిక వడ్డీ లభిస్తుంది. సాధారణ FDతో సమానంగా ఈ వడ్డీ ఉంటుంది.     

FDలాగా ఇందులోనూ డబ్బు లాక్‌ అవుతుందా?
స్వీప్ ఇన్ ఫీచర్‌తో ఈ సమస్య కూడా ఉండదు. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే, మీరు ఈ FD నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు, తర్వాత దాన్ని తిరిగి ఫిల్‌ చేయవచ్చు. నిర్ణీత గడువులోగా ఆ డబ్బును తిరిగి డిపాజిట్ చేయాలి. దీనివల్ల మీకు ఎలాంటి ఫైన్‌ పడదు, ఎఫ్‌డీ ప్రయోజనం ఏ మాత్రం తగ్గదు.     

మీరు మీ బ్యాంక్‌తో మాట్లాడటం ద్వారా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అన్ని ప్రధాన బ్యాంకులు తమ కస్టమర్లకు స్వీప్‌ ఇన్‌ ఫెసిలిటీ అందిస్తున్నాయి. మీ సౌలభ్యాన్ని బట్టి స్వీప్ పరిమితిని సెట్ చేసుకోవచ్చు. ఇది పూర్తయితే, సాధారణ సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచే FD మజాను ఆస్వాదించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *