అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సీన్‌ రివర్స్‌ – షేర్లు భారీగా పతనం

[ad_1]

Adani Enterprises: అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్ల ర్యాలీకి బ్రేక్‌ పడింది. గత ఆరు రోజులు ఫుల్ స్పీడ్‌లో వెళ్తున్న బండికి పంక్చర్ పడింది. ఆ పంక్చర్‌ చేసింది కేర్ రేటింగ్స్ (CARE Ratings) సంస్థ. 

రెగ్యులేటరీ, చట్టపరమైన దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఎంటిటీ ఔట్‌లుక్‌ను “స్టేబుల్‌” నుంచి “నెగెటివ్‌”కు కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది.

కేర్‌ రేటింగ్స్‌ ఏం చెప్పింది?
“అదానీ గ్రూప్ కంపెనీలపై వివిధ ఆరోపణలకు సంబంధించి గౌరవనీయ సుప్రీంకోర్టు నిర్దేశించిన దర్యాప్తు ఫలితాలు ప్రతికూలంగా ఉంటే, అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి ‍‌(financial flexibility) తగ్గిపోతుంది. ఈ అంచనాలతో నెగెటివ్‌ ఔట్‌లుక్‌ ఏర్పడింది” – కేర్‌ రేటింగ్స్‌

ఒకవేళ దర్యాప్తు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే, అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. అప్పుడు ఔట్‌లుక్‌ను తిరిగి “స్టేబుల్‌”గా మార్చే అవకాశం ఉంది. 

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ దాదాపు 7% డౌన్‌
ఈ డౌన్‌గ్రేడ్ తర్వాత, ఇవాళ (గురువారం, మార్చి 09, 2023) అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 6.6% వరకు నష్టపోయాయి, రూ. 1,903.85 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరాయి. మధ్యాహ్నం 12.05 గంటల సమయానికి, 5.36% నష్టంతో రూ. 1,930 వద్ద కదులుతున్నాయి.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ స్టాక్స్‌ భారీగా పతనమయ్యాయి, 50% పైగా విలువ కోల్పోయాయి. ఈ సమస్యను పరిశోధించడానికి సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. తన వంతుగా, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇవి రెండూ వచ్చే 2 నెలల్లో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

గ్రూప్‌ ఆర్థిక పరిస్థితి బాగుందని కొంతకాలంగా చెబుతూ వచ్చిన గౌతమ్‌ అదానీ, ఈ నెలాఖరులోగా కొన్ని రుణాలను ముందస్తుగానే తీర్చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, NRI ఇన్వెస్టర్ రాజీవ్ జైన్‌కు చెందిన ఇన్వెస్టింగ్‌ కంపెనీ GQG పార్టనర్స్ రంగంలోకి వచ్చింది, గత వారం అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. దీర్ఘకాలంలో అదానీ గ్రూప్ కంపెనీలకు చాలా అవకాశాలు ఉన్నాయని రాజీవ్‌ జైన్ చెప్పారు. అందుకే, మంచి విలువ వద్ద ఆయా షేర్లను దక్కించుకున్నట్లు వెల్లడించారు. అదానీ షేర్లలో తన కంపెనీ ఇంకా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చని కూడా ఒక హింట్‌ ఇచ్చారు. 

రాజీవ్‌ జైన్‌ పెట్టుబడుల ద్వారా వచ్చిన రూ. 15,446 కోట్ల నుంచి, రూ. 7,374 కోట్లను రుణాల ముందుస్తు చెల్లింపునకు అదానీ గ్రూప్‌ వినియోగించుకుంది. ఇదిపోను మిగిలిన డబ్బును గ్రూప్‌ కంపెనీల్లో లిక్విడిటీని పెంచడానికి ఉపయోగించుకుంటుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *