[ad_1]
RBI On Adani:
భారత బ్యాంకింగ్ రంగం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) అత్యంత పటిష్ఠంగా ఉన్నాయని భారతీయ రిజర్వు బ్యాంకు (Reserve Bank of India) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న అదానీ గ్రూప్ కంపెనీలకు (Adani Group) వారిచ్చిన రుణాలపై ఆందోళన లేదన్నారు. రెపోరేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచాక ఆయన మీడియాతో మాట్లాడారు.
‘భారత బ్యాంకింగ్ రంగం అత్యంత పటిష్ఠంగా ఉంది. ఎలాంటి సంక్షోభం వచ్చిన వేగంగా కోలుకోగలదు’ అని శక్తికాంతదాస్ ధీమా వ్యక్తం చేశారు. బ్యాంకులను శక్తిమంతంగా మార్చేందుకు మూడునాలుగేళ్లుగా ఆర్బీఐ చర్యలు తీసుకుందన్నారు. ‘బ్యాంకులను నియంత్రించేందుకు మేం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాం. ఆడిట్ కమిటీలకూ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. బ్యాంకుల్లో చీఫ్ రిస్క్ ఆఫీసర్లను నియమించేలా నిబంధనలు తీసుకొచ్చాం’ అని ఆయన అన్నారు.
అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ (Hindenburg) ఇచ్చిన ఓ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. చారిత్రక స్థాయికి పతనమయ్యాయి. దీంతో ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌పై అనుమానాలు వచ్చాయి. ఇదే తడవుగా కొన్ని రేటింగ్ సంస్థలు వరుస వార్తలు ఇచ్చాయి. ఈ గ్రూప్‌నకు ఉన్న మొత్తం రుణాల్లో భారత బ్యాంకులకు 38 శాతం వాటా ఉన్నట్టు సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. బాండ్లు, వాణిజ్య పత్రాల ద్వారా సేకరించిన రుణాల వాటా 37, ఆర్థిక సంస్థలు ఇచ్చిన అప్పుల వాటా 11 శాతం వరకు ఉంది. మిగతా 12-13 శాతం అంతర్గత గ్రూపుల ద్వారా తీసుకున్నారు. అప్పులు ముందుగానే తీర్చుస్తామని చెప్పడంతో ప్రస్తుతం అదానీ కంపెనీల షేర్లు పెరుగుతున్నాయి.
అదానీ కంపెనీలకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాలు తక్కువేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ అన్నారు. ‘అదానీ గ్రూప్ కంపెనీల ఆస్తులను బట్టే భారత బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. అంతేకానీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను బట్టి కాదు. ఇప్పటికైతే ఎలాంటి సమస్య లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ‘బ్యాంకులు నిబంధనలు అనుసరించే రుణాలు మంజూరు చేశాయి. వ్యక్తిగత కేసులను బట్టి వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదు’ అని వెల్లడించారు.
బుధవారం అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ మినహాయిస్తే మిగతా కంపెనీల షేర్లన్నీ ఐదు శాతం ఎగిశాయి. ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 20 శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలకు రూ.2158 వద్ద కొనసాగుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply