[ad_1]
Save Income Tax on HRA: మన దేశంలో, ఆదాయ పన్ను కడుతున్న లక్షలాది మంది ప్రజలు (Taxpayers), సొంత ఊర్లను & ఇళ్లను వదిలి ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. అలాంటి వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) కింద, అద్దెగా చెల్లించిన డబ్బుపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, కొన్ని షరతులకు లోబడి ఇది జరుగుతుంది. ITRలో HRA (House Rent Allowance)ను క్లెయిమ్ చేస్తున్న చాలామందికి, వారి ఇంటి యజమాని పాన్ (PAN Card) వివరాలు తెలీవు. సాధారణంగా, పాన్ నంబర్ ఇవ్వడానికి హౌస్ ఓనర్ నిరాకరిస్తాడు. లేదా, ఇంటి ఓనర్‌కు పాన్ కార్డ్ ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ HRA క్లెయిమ్ చేయవచ్చు.
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) క్లెయిమ్ చేయడానికి, మీరు మీ కంపెనీ నుంచి HRA పొంది ఉండాలి. అంటే, HRA మీ జీతంలో భాగమై ఉండాలి. ఇది కాకుండా, మీరు నివసిస్తున్న ఇంటిపై అద్దె చెల్లించి ఉండాలి. అంటే, మీరు ఉండే ఇల్లు మీది కాకూడదు.
అద్దె భత్యం మినహాయింపు లెక్క ఇదీ..
HRA మినహాయింపు లెక్క మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది… HRAగా స్వీకరించిన వాస్తవ మొత్తం. రెండోది… మెట్రో నగరాల్లో బేసిక్ శాలరీలో 50 శాతం + DA; నాన్ మెట్రో నగరాల్లో బేసిక్ శాలరీ + DAలో 40 శాతం మినహాయించిన తర్వాత వచ్చే మొత్తం. మూడోది… అసలు అద్దె మొత్తం నుంచి బేసిక్ జీతం + DAలో 10 శాతం మినహాయించిన తర్వాత వచ్చే మొత్తం. ఈ మూడింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. HRA మొత్తాన్ని జీతపు ఆదాయం నుంచి తీసేస్తారు, ఫలితంగా ఆదాయం తగ్గి పన్ను ఆదా అవుతుంది.
HRAపై పన్ను మినహాయింపు పొందడానికి అద్దె రసీదులు, అద్దె ఒప్పందాన్ని కంపెనీ యాజమాన్యానికి ఉద్యోగి సమర్పించాలి. వార్షిక అద్దె రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉంటే, అంటే నెలవారీ అద్దె రూ.8,333 కంటే ఎక్కువ ఉంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సర్క్యులర్ ప్రకారం, ఇంటి యజమాని పాన్ నంబర్‌ను ఆ ఉద్యోగి సమర్పించడం తప్పనిసరి. ఒకవేళ ఇంటి ఓనర్‌కు పాన్ లేకపోయినా HRAను ఆ ఉద్యోగి క్లెయిమ్ చేయవచ్చు.
ఇంటి ఓనర్ పాన్ వివరాలు లేకుండా HRA క్లెయిమ్ ఇలా..
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి ఎదుట రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది… అతను, తన కంపెనీకి ఒక డిక్లరేషన్ సమర్పించాలి. ఈ డిక్లరేషన్ ఇంటి యజమాని నుంచి పొందాలి. అందులో.. ఇంటి యజమాని పేరు, వయస్సు, ఇతర వివరాలు ఉండాలి. తన వద్ద పాన్ కార్డు లేదని ఆ డిక్లరేషన్ ఫామ్‌లో ఇంటి యజమాని ప్రకటించాలి. ఆ డిక్లరేషన్‌ను కంపెనీ అంగీకరిస్తుంది.
కొన్ని సందర్భాల్లో, ఇంటి యజమాని డిక్లరేషన్‌ను కంపెనీ అంగీకరించకపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రెండో ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ ఉద్యోగి, తన ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు HRA క్లెయిమ్ చేయవచ్చు. ఈ సందర్భంలో, ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ (Income Tax Notice) వచ్చే అవకాశం ఉంది. ఫారం-26ASలో కంపెనీ నివేదించిన ఆదాయానికి, ఉద్యోగి దాఖలు చేసిన రిటర్న్‌లో వెల్లడించిన ఆదాయానికి తేడా ఉంటుంది కాబట్టి నోటీస్ రావచ్చు. ఈ వ్యత్యాసం గురించి ఆదాయపు పన్ను విభాగం అడగవచ్చు. ఆ సమయంలో, ఇంటి యజమాని డిక్లరేషన్‌తో పాటు అద్దె రసీదులు, అద్దె ఒప్పందాన్ని ఆ ఉద్యోగి ఐటీ డిపార్ట్‌మెంట్‌కు సమర్పిస్తే సరిపోతుంది.
సాధారణంగా, ఇంటి యజమానులు పాన్ నంబర్ ఇవ్వరు, అద్దెను నగదు రూపంలో మాత్రమే తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో, రిజిస్టర్ చేసిన అద్దె ఒప్పందం (Registered tenancy agreement) ఆ ఉద్యోగికి సాయపడుతుంది. అద్దె ఒప్పందాన్ని రిజిస్టర్ చేయడానికి.. ఇంటి యజమాని పేరు, చిరునామా, ఒప్పందం వ్యవధి, పాన్ కార్డ్ వివరాలతో పాటు అద్దె మొత్తం, ఇంటి యజమాని & అద్దెదారు వ్యక్తిగత గుర్తింపు రుజువులు అవసరం. HRAని క్లెయిమ్ చేయడానికి అద్దె ఒప్పందాన్ని ఉపయోగించిన వెంటనే, ఇంటి యజమాని పాన్ సమాచారం ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. ఇది కాకుండా.. ఇంటి అద్దెను నగదుకు బదులుగా చెక్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆ ఉద్యోగి చెల్లించాలి.
HRA క్లెయిమ్ చేయడానికి, అద్దె ఒప్పందం & అద్దె రసీదులు అవసరం. నమోదిత అద్దె ఒప్పందంతో పాటు బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా చెల్లింపులు చేయడం వల్ల HRA క్లెయిమ్ చేయడం ఉద్యోగికి సులభంగా మారుతుంది. అలాగే, అద్దె ద్వారా వచ్చిన ఆదాయం ఇంటి యజమాని ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో (Annual Information Statement) కనిపిస్తుంది. అప్పుడు, ఆ ఇంటి యజమాని పన్ను చెల్లించాల్సి ఉంటుంది, లేదంటే పన్ను ఎగవేతగా ఐటీ డిపార్ట్‌మెంట్ పరిగణిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: బిలియనీర్లను చూశాం, తొలి ట్రిలియనీర్ ఎప్పుడు పుడతాడో తెలుసా?
[ad_2]
Source link
Leave a Reply