[ad_1]
Repo Rate:
రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అమెరికా ఫెడ్ సైతం వడ్డీరేట్ల పెంపు వేగాన్ని క్రమంగా తగ్గిస్తోంది. దాంతో వచ్చే వారం ఆర్బీఐ నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షపై అందరి చూపూ నెలకొంది. ఇప్పటికీ లక్షిత రేటు కన్నా ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉండటంతో రెపోరేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతేడాది మే నుంచి ఆర్బీఐ 225 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచింది. వరుసగా 50 బేసిస్ పాయింట్లు పెంచిన కేంద్ర బ్యాంకు చివరి సారి 35 పాయింట్లకే పరిమితమైంది. ఇప్పుడు మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి ధరల పెరుగుదలకు కారణం అవుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.
ఆర్బీఐ విధాన రేట్ల నిర్ణయ కమిటీ సోమవారం నుంచి మూడు రోజుల సమావేశం నిర్వహించనుంది. ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు వివరిస్తారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికీ కేంద్ర బ్యాంకుల లక్ష్యం కన్నా ఎక్కువగానే ఉందని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఓ రిపోర్టు వెలువరించింది. రాబోయే నెలల్లో ధరలు తగ్గుతాయని అంచనా వేసింది. ఇదే జరిగితే 2023 తొలి అర్ధభాగంలో రేట్ల పెంపు ముగుస్తుంది తెలిపింది. బహుశా 2023 రెండో అర్ధభాగం లేదా 2023 ఆరంభంలో వడ్డీరేట్ల తగ్గింపు మొదలవుతుందని వెల్లడించింది.
‘ప్రపంచ వ్యాప్తంగా ఇంకా అనిశ్చితి నెలకొంది. కేంద్ర బ్యాంకులు విధాన రేట్లు తగ్గించే అవకాశం పరిమితంగానే ఉంటుంది. అంటే మరికొన్నాళ్లు వడ్డీరేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేరుస్తుందని మా అంచనా. అభివృద్ధి, ద్రవ్యోల్బణంపై కఠిన ద్రవ్య విధాన నిర్ణయాల ప్రభావాన్ని మదింపు చేస్తుండొచ్చు’ అని కొటక్ నివేదిక వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచుకోవాలన్నది ఆర్బీఐ లక్ష్యం. మరో 2 శాతం వరకు మార్జిన్‌గా ఎంచుకుంది. 2022, జనవరి నుంచి దేశ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగానే ఉంటోంది.
ఆర్బీఐ (RBI) ద్రవ్య పరపతి విధాన సమీక్షను అనుసరించే ఈ వారం స్టాక్ మార్కెట్ల కదలికలు ఉంటాయి. చివరి వారమంతా అదానీ గ్రూప్ షేర్ల పతనం మార్కెట్లపై విపరీతమైన ప్రభావం చూపించింది. దాంతో మదుపర్లు అప్రమత్తంగా ఉంటున్నారు.
Also Read: ఈపీఎఫ్ నిబంధనల్లో మార్పు – ఆ తేదీ తర్వాత డబ్బు విత్‌డ్రా చేస్తే 30 శాతానికి బదులు 20% పన్ను!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply