పాకిస్థాన్‌లో ఆకలి కేకలు, 36 శాతం దాటిన ద్రవ్యోల్బణం

[ad_1]

Pakistan Food Crisis: మన దేశంలో ద్రవ్యోల్బణం 6 స్థాయికి చేరితే, ధరలు మండిపోతున్నాయంటూ జనం గగ్గోలు పెట్టారు. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును భారీగా పెంచింది. మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం మన దగ్గర కంటే ఆరు రెట్లు ఎక్కువ నమోదైంది. ఇక ఆ దేశంలో ధరలు, ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.

పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అధిక రేట్ల వద్ద కొనలేక, బతుకు బండిని లాగలకే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఆహార పదార్థాల నుంచి దుస్తుల వరకు రేట్లు మండిపోతున్నాయి. ఒక్కరోజు తర్వాత వాకబు చేసినా కొత్త రేటు చెబుతున్నారు వ్యాపారస్తులు. చమురు, రవాణా, విద్యుత్‌, వసతి, ఆహారం, పానీయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, గృహోపకరణాలు, బట్టలు, చెప్పులు, బూట్లు వంటి వాటి ధరలు విపరీతంగా పెరగడం అక్కడ సర్వసాధారణ విషయంగా మారింది.

పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 36.5 శాతం
పాకిస్థాన్‌కు చెందిన ప్రధాన పరిశోధన సంస్థ ఆరిఫ్ హబీబ్ లిమిటెడ్ నివేదిక ప్రకారం… ఏప్రిల్‌లో నెలలో పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 36.5 శాతానికి చేరుకుంది. మార్చిలో ద్రవ్యోల్బణం 35.4 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా పెరుగుతోంది. మే నెలలో ఆహార సూచీ ఒక్కటే 5 శాతం పెరగవచ్చని ఆ నివేదిక చెబుతోంది. తద్వారా, ఆహార పదార్థాల విషయంలో మరిన్ని దుర్భర పరిస్థితులను అంచనా వేసింది. 

ఒకప్పుడు అఖండ భారత్‌లో అంతర్భాగంగా ఉండి 1947లో కొత్త దేశంగా విడిపోయినా పాకిస్థాన్‌, అక్కడి ప్రభుత్వాల్లో స్థిరత్వ లేమి కారణంగా భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సాధారణ ప్రజల ఆహారమైన బియ్యం, గోధుమలు కూడా బాగా ఖరీదుగా మారడంతో, వాటిని కొనలేక, కడుపు నిండా తిండి లేక అలమటిస్తున్నారు. ఆహార పదార్థాల ధరలతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు కూడా విజృంభిస్తున్నాయి. ఇటీవలే ముగిసిన రంజాన్‌ మాసంలో దుస్తులు, బూట్ల ధరలు భారీగా పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తిన్నా, తెచ్చుకున్నా ఖరీదైన వ్యవహారంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలన్నీ కలిసి పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణాన్ని తారస్థాయికి పెంచుతున్నాయి.

పెరుగుతున్న దారిద్య్ర రేఖ ప్రభావం
ద్రవ్యోల్బణం రేటులో పెరుగుదల ఫలితం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మీద పడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇంధన ధరలు, పన్నులను పెంచుతోంది అక్కడి ప్రభుత్వం. పాక్‌ ప్రజల తలసరి ఆదాయం కూడా తగ్గింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి బెయిలౌట్ ప్యాకేజీ పూర్తిగా రాకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పాకిస్థాన్ ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు జారిపోతున్నారు. గృహ వ్యయం పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.

దీంతో పాటు, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఉపశమన ప్యాకేజీని పొందడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. IMF నుంచి బెయిలౌట్‌ ప్యాకేజీ అందితే, అది పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తుంది. అయితే.. ఉపశమన ప్యాకేజీని ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి విధిస్తున్న షరతులు పాకిస్థాన్‌ ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.

2019లో $6.5 బిలియన్ల బెయిలౌట్ ఫండ్‌పై పాకిస్తాన్‌ సంతకం చేసింది. అయితే ఈ ఫండ్‌లో కొంత భాగాన్ని మాత్రమే IMF విడుదల చేసింది. తదుపరి విడత కోసం చర్చలు జరుగుతున్నాయి. IMF విధించిన షరతులను పాకిస్తాన్ నెరవేర్చకపోవడంతో బెయిలౌట్ ఫండ్ తదుపరి జారీని అంతర్జాతీయ ద్రవ్య నిధి నిలిపివేసింది.

పెద్ద నోట్ల రద్దు కోసం డిమాండ్‌
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు పెద్ద నోట్ల రద్దు డిమాండ్‌ వినిపిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ముందుగా 5000 రూపాయల నోటును రద్దు చేయాలని, ఆ తర్వాత మిగిలిన పెద్ద నోట్లను రద్దు చేయాలని ఆర్థికవేత్త అమ్మర్ ఖాన్ చెబుతున్నారు. భారతదేశాన్ని ఉదాహరణగా చూపుతూ, పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్‌లో పన్నుల వసూళ్లు వేగంగా పెరిగాయని వివరించారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *