బ్యాడ్‌ టైమ్‌ వెళ్లిపోతోందట, గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్‌

[ad_1]

RBI Governor: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) చల్లటి కబురు చెప్పారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధి తగ్గితే తగ్గొచ్చుగానీ.. ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడిన చెడు ప్రభావం ఇప్పుడు తగ్గిందని అన్నారు. ఆర్థిక వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, కరెన్సీ విషయాల్లో వెల్లడైన తాజా సమాచారం ప్రకారం, ఆర్థిక మార్కెట్లు & ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చెత్త దశకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని చెప్పారు.

వడ్డీ రేట్ల భారం ఇంకొంత కాలం భరించాల్సిందే
అయితే.. అధిక వడ్డీ రేట్ల కాలం మరికొంత కాలం పాటు కొనసాగవచ్చని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించవచ్చని అంచనా వేస్తున్నామని; ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం రెండింటి వల్ల ఏర్పడిన అధ్వాన్న పరిస్థితులు ఈ ఏడాది నుంచి క్రమంగా మెరుగు పడతాయని తెలుస్తోందని వెల్లడించారు. దుబాయ్‌లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FIMMDA), ప్రైమరీ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (PDIA) వార్షిక సమావేశంలో పాల్గొన్న శక్తికాంత దాస్‌, ఈ విషయాలు వెల్లడించారు.

కొవిడ్ మహమ్మారి కారణంగా విధించిన పరిమితులను సడలించడం, వివిధ దేశాలలో ద్రవ్యోల్బణం తీవ్రత తగ్గుతున్న విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రస్తావించారు. కాబట్టి, సెంట్రల్ బ్యాంక్‌లు తమ పాలసీ రేట్లను మరీ దూకుడుగా పెంచకపోవచ్చని.. తక్కువ స్థాయి పెంపు లేదా యథాతథంగా ఉంచవచ్చన్న సూచనలు అందుతున్నాయని అన్నారు.

భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు ఇంకా ఎక్కువగానే ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణాన్ని టాలరెన్స్ బ్యాండ్‌లోకి తీసుకురావాలనే లక్ష్యానికి సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉందని శక్తికాంత దాస్ చెప్పారు. వడ్డీ రేట్లు ఎక్కువ స్థాయిలోనే కొనసాగవచ్చని, ప్రస్తుతానికి దాన్నుంచి ఉపశమనం లేదంటూ హింట్‌ ఇచ్చారు.

ప్రపంచ వృద్ధి రేటు గురించి మాట్లాడుతూ.. తీవ్ర మాంద్యం వచ్చే అవకాశం ఉందని కొన్ని నెలల క్రితం వరకు భావించామని, ఇప్పుడు పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోందని, సాధారణ మాంద్యం మాత్రం వచ్చే అవకాశం ఉందని వివరించారు. అనిశ్చిత అంతర్జాతీయ వాతావరణంలోనూ “మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని”, స్థూల ఆర్థిక డేటాలో ఎక్కడా బలహీనత కనిపించడం లేదని శక్తికాంత దాస్‌ చెప్పారు.

బ్యాంకులు భేష్‌
బ్యాంకులు, కంపెనీలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు. బ్యాంకులు ఇచ్చే రుణాల్లో రెండంకెల వృద్ధి కనిపిస్తోందన్నారు. 

ప్రధాన ద్రవ్యోల్బణం ‍‌(Core Inflation) రేటు ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నా, 2022 నవంబర్ & డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు బాగా తగ్గిందని ఆయన అన్నారు. డిసెంబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతానికి దిగి వచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

2023 ఫిబ్రవరి 6-8 తేదీల్లో RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్‌ జరుగుతుంది. RBI రెపో రేటు ప్రకటన మీద 8వ తేదీన గవర్నర్‌ ప్రకటన ఉంటుంది. 

ALSO READ: రెండ్రోజుల్లో రూ.11 లక్షల కోట్ల నష్టం, వచ్చే వారం మార్కెట్‌ను నడిపించేది ఇవే!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *