సుప్రీంకోర్టుకు చేరిన అదానీ గ్రూప్‌ – హిండెన్‌బర్గ్‌ గొడవ, శుక్రవారమే విచారణ

[ad_1]

Hindenburg – Adani Group: అదానీ గ్రూప్‌ – హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్ అంశం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది. ఈ అంశం మీద దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం నాడు (ఫిబ్రవరి 10, 2023) సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. అదానీ గ్రూప్‌  ‌(Adani Group) మీద హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. 

న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అదానీ గ్రూప్‌ – హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో అత్యవసర విచారణ చేపట్టాలని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై గత వారం ఒక ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలైందని, ఫిబ్రవరి 10న విచారణ జరుగుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్‌తో పాటు తన పిటిషన్‌ కూడా వినాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్‌ను విశాల్ తివారీ కోరారు. విశాల్ తివారీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) విచారణకు స్వీకరించింది. శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపింది. 

గత వారం పిటిషన్‌ వేసింది ఎవరు?
అదానీ గ్రూప్‌ మీద నివేదిక ఇచ్చి ఆ సంస్థ మార్కెట్‌ విలువ పతనానికి కారణంగా నిలిచిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓనర్‌ నాథన్‌ అండర్సర్‌, అతని బృంద సభ్యుల మీద దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది ఎం.ఎల్‌. శర్మ గత వారం పిటిషన్‌ దాఖలు చేశారు. దేశంలోని పెట్టుబడిదార్లను హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ సభ్యులు లూఠీ చేశారని, అదానీ గ్రూప్‌ షేర్లను కృత్రిమంగా తగ్గించి లాభపడ్డారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎల్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడుతుంది. న్యాయవాది విశాల్ తివారీ కూడా ఇదే అంశం మీద పిటిషన్‌ దాఖలు చేశారు కాబట్టి, ఈ ఇద్దరి పిటిషన్లను కలిపి విచారణ చేస్తుంది.

అదానీకి జరిగిన నష్టం ఎంత?
భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న అదానీ గ్రూప్‌ మీద, అమెరికన్ షార్ట్ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొన్ని ఆరోపణలు చేస్తూ 24 జనవరి 2023న ఒక నివేదిక విడుదల చేసింది. షేర్లకు సంబంధించి గౌతమ్ అదానీ కంపెనీలు అనేక అవకతవకలకు పాల్పడ్డాయని అందులో ఆరోపించింది. ఆ రిపోర్ట్‌ తర్వాత అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పాతాళానికి పడిపోయాయి. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ స్టాక్స్‌ విలువ 100 బిలియన్లకు పైగా క్షీణించింది, దాదాపు సగం ఆవిరైంది. ఈ పతనం, గౌతమ్‌ అదానీని ప్రపంచ సంపన్నుల జాబితాలోని 3 స్థానం నుంచి అతి దూరంగా నెట్టేసింది. ప్రస్తుతం, సంపన్నుల జాబితాలో 17వ స్థానంలో గౌతమ్‌ అదానీ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని గ్లోబల్‌ రేటింగ్‌ కంపెనీలు కూడా అదానీ గ్రూప్‌ సెక్యూరిటీల విలువను సున్నాకు తగ్గించాయి.  

అదానీ గ్రూప్‌ అంశంపై రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది. పార్లమెంట్‌ జాయింట్‌ కమిటీని (JPC) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని, లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కొన్ని రోజులుగా కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *