మళ్లీ ‘గూగుల్‌ గూబ గుయ్‌’మంది, NCLATలోనూ పని కాలేదు

[ad_1]

Google Penalty Update: సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ (National Company Law Appellate Tribunal –  NCLAT) చుక్కెదురైంది. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణ మీద, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India- CCI) విధించిన రూ. 1,337.76 కోట్ల పెనాల్టీ మీద మధ్యంతర స్టే ఇవ్వడానికి NCLAT నిరాకరించింది. 

CCI విధించిన జరిమానా ఆర్డర్‌ మీద NCLATని గూగుల్‌ ఆశ్రయించింది. అపరాధ రుసుమును రద్దు చేయలన్న పిటిషన్‌ మీద ఇద్దరు సభ్యుల NCLAT బెంచ్ బుధవారం విచారణ జరిపింది. అయితే, జరిమానా అమలుపై తక్షణమే స్టే విధించేందుకు బెంచ్‌ నిరాకరించింది. ఇతర పార్టీల వాదనలు విన్న తర్వాత మాత్రమే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ముందుగా, CCI విధించిన జరిమానాలో 10 శాతాన్ని జమ చేయాలని కూడా ట్రైబ్యునల్‌ ఆదేశించింది. దీంతో, రూ. 1,337.76 కోట్లలో 10 శాతం అంటే దాదాపు 137.77 కోట్లను గూగుల్‌ జమ చేయాల్సి ఉంటుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా అప్పీలేట్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. మధ్యంతర స్టే మీద విచారణ కోసం, ఫిబ్రవరి 13న కేసును లిస్ట్‌ చేయాలని ఆదేశించింది. అంటే, ఆ రోజు కేసు విచారణ కొనసాగుతుంది.

గూగుల్ వాదన ఏంటి?
CCI విధించిన పెనాల్టీ ఆర్డర్ భారతీయ వినియోగదారులకు పెద్ద దెబ్బ అని, దేశంలో స్మార్ట్‌ ఫోన్‌ ధరలు మరింత పెరుగుతాయని తన పిటిషన్‌లో గూగుల్ పేర్కొంది. విచారణ సందర్భంగా, గూగుల్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అక్టోబర్ 20 నాటి CCI ఆర్డర్‌పై తక్షణమే స్టే విధించాలని బెంచ్‌ను కోరారు. సింఘ్వి అభ్యర్థనను బెంచ్‌ తోసిపుచ్చింది. అంత తొందరేంటని, జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, అలోక్‌ శ్రీవాస్తవలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం ప్రశ్నించింది. సరైన విచారణ లేకుండా ఏ విధమైన ఆదేశాలూ ఇవ్వలేమని గూగుల్‌కు NCLAT స్పష్టం చేసింది. CCI పెనాల్టీ ఆర్డర్‌ మీద పిటిషన్‌ దాఖలు చేయడానికి రెండు నెలల సమయం తీసుకున్న మీరు, రెండు నిమిషాల్లో మేం ఆదేశాలు ఇస్తామని ఆశిస్తున్నారా అని ప్రశ్నించింది. CCI ఆదేశం అందిన ఒకట్రెండు వారాల్లో మీరు NCLATని ఆశ్రయించి ఉంటే బాగుండేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేసు పూర్వాపరాలు
తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధిపత్య స్థానాన్ని అనేక మార్కెట్లలో గూగుల్‌ దుర్వినియోగం చేసిందని CCIకి ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ యాప్స్‌ను ఏకపక్షంగా ఇన్‌స్టాల్‌ చేసి అందిస్తోందని, వాటిని అన్‌ ఇన్‌స్టాల్‌ చేసే ఆప్షన్‌ ఇవ్వడం లేదని, పైగా డిఫాల్ట్‌గా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ మాత్రమే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటోదని ఆ ఫిర్యాదుల్లో ఉన్నాయి. ఆరోపణల మీద విచారణ జరిపిన CCI, 2022 అక్టోబర్ 20న, గూగుల్‌కు రూ. 1,337.76 కోట్ల పెనాల్టీని విధించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి, తమకు ఇష్టమైన సెర్చ్‌ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వినియోగదార్లకు గూగుల్‌ వీలు కల్పించాలని ఆదేశించింది. అంతేకాదు… అనైతికమైన, అన్యాయమైన వాణిజ్య విధానాలను నిలిపివేయాలని ఆదేశించింది.

live reels News Reels

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *