పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ జిల్లాకు చెందిన సంజయ్ మహటో అనే వ్యక్తి తన భార్య అనుమిక పుట్టిన రోజు చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చాడు. అయితే చంద్రుడిపై ఒక ఎకరం భూమిని కేవలం రూ. 10,000 లకే కొని తన భార్యకు అందించాడు. అయితే వారిద్దరూ చాలా కాలం ప్రేమించుకుని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అయితే పెళ్లికి ముందు తన భార్యకు చంద్రుడిని తీసుకువస్తానని హామీ ఇచ్చానని సంజయ్ మహటో పేర్కొన్నాడు. అందులో భాగంగానే చంద్రయాన్ 3 సాధించిన విజయంతో ఈ భూమిని కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. పెళ్లికి ముందు ఇచ్చిన ప్రామిస్ కారణంగా పెళ్లి తర్వాత వచ్చిన తన తొలి పుట్టిన రోజు సందర్బంగా చంద్రుడిపై ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చానని సంజయ్ మహటో వివరించాడు.
అయితే తాను చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసేందుకు సంబంధించిన వివరాలను కూడా సంజయ్ మహటో చెప్పాడు. తన స్నేహితుడి సాయంతో లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపుగా ఏడాది సమయం పట్టిందని పేర్కొన్నాడు. అయితే తన భర్త సంజయ్ మహటో ఇచ్చిన అరుదైన బహుమతితో అతని భార్య అనుమిక మురిసిపోతోంది. నిజానికి చంద్రుడిపై భూమి కొనుగోలు, ప్రైవేట్ ఓనర్ షిప్ సాధ్యం కాకపోయినప్పటికీ కొన్ని వెబ్‌సైట్లు ఇలా చంద్రుడిపై భూమిని అమ్ముతూ సర్టిఫికేట్స్ జారీ చేస్తూ ఉంటాయి.
ఇటీవల చంద్రయాన్ 3 విజయం తర్వాత తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కూతురు సాయి విజ్ఞత కూడా తన తల్లికి చంద్రుడిపై భూమిని కొనిచ్చింది. 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా.. చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ఆగస్టు 23 వ తేదీన వారికి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. అంతకుముందు 2020లో రాజస్థాన్ అజ్మీర్ కి చెందిన ధర్మేంద్ర అనిజా అనే వ్యక్తి మ్యారేజ్ డే సందర్భంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రుడిపై 3 ఎకరాల భూమిని గిఫ్గ్‌గా ఇచ్చాడు.
Read More Latest Science & Technology News And Telugu News