అదానీ గ్రూప్‌ FPOపై సెబీ సీరియస్‌ – ఆ ఇన్వెస్టర్లతో లింకులపై దర్యాప్తు!

[ad_1]

SEBI – Adani Group: 

అదానీ – హిండెన్‌బర్గ్‌ వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది! అదానీ గ్రూప్‌తో కొందరు ఇన్వెస్టర్లకు ఉన్న సంబంధాలపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిలిపివేసిన 2.5 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌పీవోతో వారికున్న సంబంధాలపై విచారించనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలే ఇందుకు నేపథ్యం!

షేర్ల విక్రయాల ప్రక్రియలో భారత మార్కెట్‌ నియంత్రణ చట్టాలను అదానీ గ్రూప్‌ (Adani Group) ఉల్లంఘించిందా, పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడిందా సెబీ విచారించనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రెండు వర్గాలు తెలిపాయి. మారీషస్‌ కేంద్రంగా నడిచే గ్రేట్‌ ఇంటర్నేషనల్‌ టస్కర్‌ ఫండ్‌, ఆయుష్మంత్ లిమిటెడ్‌తో అదానీ సంబంధాలపై దర్యాప్తు చేయనుంది. ఈ రెండు సంస్థలు అదానీ కంపెనీల్లో యాంకర్‌ ఇన్వెస్టర్లుగా ఉన్నారని సమాచారం.

భారత స్టాక్‌మార్కెట్‌ (Stock Market) నిబంధనల ప్రకారం కంపెనీ స్థాపకులు లేదా స్థాపకుల బృందంతో అనుబంధం కలిగినవాళ్లు యాంకర్‌ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు చేసేందుకు అనర్హులు. ఈ నేపథ్యంలో ఎవరైనా యాంకర్‌ ఇన్వెస్టర్లకు స్థాపకుల బృందంతో సంబంధాలున్నాయేమో సెబీ దర్యాప్తు చేయనుంది.

ఈ విచారణపై సెబీ, అదానీ గ్రూప్‌ ఇంకా స్పందించలేదు. గ్రేట్‌ ఇంటర్నేషనల్‌ టస్కర్‌ ఫండ్‌, ఆయుష్మంత్‌ లిమిటెడ్‌ సైతం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. షేర్లను ఆఫర్‌ చేసిన ఎలారా క్యాపిటల్‌, మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులూ సెబీ స్కానర్లో ఉన్నట్టు తెలిసింది. గతవారమే నియంత్రణ సంస్థ వారిని సంప్రదించిందని సమాచారం. పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై శోధించనుంది.

అదానీ గ్రూప్‌లోని ఒక కంపెనీకి మోనార్క్‌లో కొంత వాటా ఉందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. ఈ సన్నిహిత సంబంధాలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తాయని తెలిపింది. మారీషస్‌ కేంద్రంగా నడిచే ఎలారా ఫండ్‌ తన మార్కెట్‌ విలువలో 99 శాతం మూడు అదానీ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టిందని పేర్కొంది. అయితే రిటైల్‌ మార్కెట్‌పై పట్టున్న మోనార్క్‌ను అంతకు ముందు షేర్ల అమ్మకాల ప్రక్రియకు ఎంచుకున్నామని అదానీ పేర్కొన్నారు. ఇక ఎలారాతో తమకు అసలు సంబంధాలే లేవని కొట్టిపారేశారు.

ఏదేమైనా అదానీ వ్యవహారంపై కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయంలో వివరించిందని సమాచారం. మోదీ కార్యాలయం సెబీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఏయే అంశాలపై చర్చిస్తున్నారో రాయిటర్స్‌ వెల్లడించలేదు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *