[ad_1]
Retail Inflation:
గుడ్‌న్యూస్! దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోంది. మే నెలలో 4.25 శాతంగా నమోదైంది. 25 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో ఇది 4.70 శాతంగా ఉండేదని స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ సోమవారం వెల్లడించింది. వరుసగా మూడో నెల వినియోగ ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 2-6 శాతం పరిధిలోనే ఉండటం గమనార్హం.
ఏప్రిల్ నెలలో 3.84 శాతంగా ఉన్న వినియోగదారుల ఆహార సూచీ (CFPI) మే నెలలో 2.91 శాతానికి తగ్గింది. ఇక గ్రామీణ ద్రవ్యోల్బణం 4.17 శాతం, పట్టణ ద్రవ్యోల్బణం 4.27 శాతంగా నమోదయ్యాయి. మొత్తంగా మే నెలలో ద్రవ్యోల్బణం 0.51 శాతంలో మార్పులేదు.
కూరగాయల ద్రవ్యోల్బణం రేటు మే నెలలో 8.1 శాతానికి తగ్గింది. ఆహారం – పానీయాలు, ఇంధన రంగాల ఇన్‌ఫ్లేషన్ వరుసగా 3.29 శాతం, 4.64 శాతంగా ఉన్నాయి. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 13.67 నుంచి 12.65 శాతానికి తగ్గింది. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడంతోనే ఆహారం, పప్పుల ధరలు తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణాన్ని వెనక్కి తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా ఎల్పీజీ, కిరోసిన్ ధరలు తగ్గాయి.
వరుసగా మూడు త్రైమాసికాల్లో భారత ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యిత రేటు 6 శాతం కన్నా ఎక్కువగానే నమోదైంది. 2022, నవంబర్ నుంచి దిగరావడం మొదలైంది. కాగా ఏప్రిల్‌లో 4.70 శాతంగా ఉన్న ఇన్‌ఫ్లేషన్ మే నెలలో 4.42 శాతానికి దిగొస్తుందని రాయిటర్స్ పోల్‌లో కొందరు ఎకానమిస్టులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆహార పదార్థాలపై వేడిగాలుల ప్రభావం ఉన్నప్పటికీ ఇన్‌పుట్ కాస్ట్‌ను తగ్గించి ధరల పెరగకుండా చూడటంలో కేంద్రం విజయవంతం అయింది.
‘ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ట్రెండు మే నెలలోనూ కొనసాగుతుందని మేం అంచనా వేశాం. ఏప్రిల్‌లోని 4.7 శాతం నుంచి 4.34 శాతానికి తగ్గుతుందని భావించాం. మా అంచనా నిజమైతే సీపీఐ ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ఠానికి చేరుకుంటుంది’ అని బార్క్‌లేస్ ఎండీ రాహుల్ బజోరియా అన్నారు. ఒకవేళ ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంటే 2023 జులై నుంచి ధరలు పెరగొచ్చని హెచ్చరించారు. వర్షాలు సకాలంలో కురవకపోయినా, తగినంత వర్షపాతం నమోదు కాకపోయినా ఉత్పత్తిపై దెబ్బపడుతుందని వెల్లడించారు. ‘ఇంటి నిర్మాణాలు, పాదరక్షలు, ఆరోగ్యం, విద్య రంగాల్లో ద్రవ్యోల్బణం ఎప్పట్లాగే ఉంటుంది. డిమాండ్ పెరిగితే ఉత్పత్తిదారులకు మెరుగైన ప్రైసింగ్ పవర్ వస్తుంది’ అయని ఆయన చెప్పారు.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్‌లో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో, ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 6.50% వద్దే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI governor shaktikanta das) కొనసాగించారు. ఫలితంగా బ్యాంక్ లోన్లు రేట్లు కూడా మారకుండా పాత రేట్లే కొనసాగుతాయి. సామాన్యుడికి ఇది ఊరట. MPCలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు “వడ్డీ రేట్ల పెంపులో విరామం” నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా, రెండో త్రైమాసికంలో 5.2 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.4 శాతంగా, చివరి త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా.
[ad_2]
Source link
Leave a Reply