[ad_1]
Gautam Adani:
ఒక చిన్న రిపోర్టు ఎంత పనిచేసింది? ప్రపంచంలోనే అప్రతిహత వేగంతో సంపద పోగేస్తున్న భారతీయ కుబేరుడిని ఊహించని విధంగా కుదిపేసింది. కేవలం నెల రోజుల్లోనే ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీని ఇప్పుడు 30వ ర్యాంకుకు పడేసింది. ప్రపంచ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఇప్పుడాయన స్థానం తగ్గిపోయింది.
వంటనూనెలు, గనులు, ఇంధనం, విద్యుత్ సరఫరా, డేటా సెంటర్లు, విమానాశ్రయాలు, కమోడిటీస్, సిమెంట్, నౌకాశ్రయాలు సహా ఎన్నో రంగాల్లో వ్యాపారాలు గౌతమ్ అదానీ గ్రూప్ సొంతం. ఐదేళ్లుగా ఆయన ప్రభ వెలిగిపోయింది. ఆయన కంపెనీల షేర్లు ఆకాశాన్ని తాకాయి. కనీవినీ ఎరగని రీతిలో, వ్యాపార పరిమాణం, లాభదాయకతతో సంబంధం లేకుండా ఎగిశాయి. అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ నివేదికతో ఆ షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఫలితంగా నెల రోజుల్లోనే ఆయన రూ.12 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో 30వ స్థానానికి తగ్గిపోయారు.
హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ తర్వాత అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్ల విలువ రూ.12.06 లక్షల కోట్ల పతనమైంది. ఇది దేశంలోనే రెండో అత్యంత విలువైన టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సమానం. అదానీ టోటల్ గ్యాస్‌పై ఎక్కువ దెబ్బ పడింది. ఏకంగా 80.68 శాతం మార్కెట్ విలువ నష్టపోయింది. ఇక అదానీ ఎనర్జీ 76.62 శాతం విలువను కోల్పోయింది. అదానీ ట్రాన్స్మిషన్ జనవరి 24 నుంచి 74.21 శాతం నష్టపోయింది. అదానీ పవర్, అదానీ విల్మార్, గ్రూపు సిమెంటు కంపెనీలు, అదానీ పోర్ట్స్ చాలా వరకు మార్కెట్ విలువను కోల్పోవాల్సి వచ్చింది.
ఈ పది కంపెనీల్లో గౌతమ్ అదానీ మార్కెట్ విలువ ప్రకారం 80.06 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. హిండెన్‌బర్గ్ నివేదిక ముందు ఆయన సంపద విలువ 120 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడు 40 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఫలితంగా ఆసియాలో నంబర్ వన్, ప్రపంచంలో మూడో స్థానం నుంచి పడిపోయారు. 2001లో అకౌంటింగ్ కుంభకోణం బయటపడ్డాక అమెరికా ఎనర్జీ కంపెనీ ఎన్రాన్ను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని అమెరికా ట్రెజరీ మాజీ సెక్రెటరీ లారీ సమ్మర్ పేర్కొన్నారు.
ఆదాయ వృద్ధి లక్ష్యానికి అడ్డుకోత
ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అదానీ గ్రూప్ (Adani Group) ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. తన ఆదాయ వృద్ధి (revenue growth) లక్ష్యాన్ని ఈ గ్రూప్ ఏకంగా సగానికి సగం అడ్డంగా కోసేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 40 శాతం లక్ష్యం సాధించాలని అదానీ గ్రూప్ గతంలో భావిస్తే, ఇప్పుడు దానిని 15-20 శాతానికి పరిమితం చేసింది. గ్రూప్ చేపట్టే కొత్త మూలధన వ్యయాలు (Capital expenditure) లేదా కొత్త పెట్టుబడులను కూడా నెమ్మదింపజేస్తోంది.
భారీ స్థాయి పెట్టుబడులతో మార్కెట్‌ను ఒక ఊపు ఊపాలని, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రాక ముందు వరకు గౌతమ్ అదానీ భావించారు. మార్కెట్ మైండ్ బ్లాంక్ చేసే పెట్టుబడులతో, గ్రూప్ కంపెనీల సంపదను ఎవరూ ఊహించని రీతిలో పెంచాలని భావించారు. ఇప్పుడు, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్లాన్స్‌ను అదానీ వాయిదా వేశారు. దూకుడుగా విస్తరించే బదులు, గ్రూప్ కంపెనీల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి సారించాలని అదానీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు నెలల పాటు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఆపితే, గ్రూప్‌లోని అన్ని కంపెనీల వద్ద 3 బిలియన్ డాలర్ల వరకు డబ్బు ఆదా అవుతుందట. ఆ డబ్బును రుణాన్ని తిరిగి చెల్లించడానికి లేదా నగదు నిల్వను పెంచడానికి ఉపయోగించుకోచ్చని సమాచారం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply